మార్పు మొద‌లైంది, అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది - శ్రీ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్
విభాగం: రాజకీయ వార్తలు
the-change-began-,-it-will-be-seen-in-the-assembly---sri-pawan-kalyan-_kuwait

మార్పు మొద‌లైంది... అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది.. ఎంత ఏంటి అనే సంగ‌తి ప‌క్క‌న‌పెడితే జ‌న‌సేన పార్టీ బ‌లాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్ద'ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు స్పష్టం చేశారు.

 

జ‌న‌సేన బ‌లం తెలియ‌దు అన్న ప‌దం ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్ద‌ని, కొన్ని ల‌క్ష‌ల మంది యువ‌త వెంట ఉన్నార‌ని అన్నారు. మీడియా, మందీ మార్బలం లేకుండా.. ఇంతమంది ఎన్ని కోట్లు ఇస్తే వ‌స్తార‌ని ప్ర‌శ్నించారు. ఆదివారం మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో పార్టీ త‌రఫున  పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపి అభ్య‌ర్ధుల‌తో ముఖాముఖి స‌మావేశం నిర్వ‌హించారు. రెండో విడ‌త జ‌రిగిన ఈ స‌మావేశంలో పాల్గొన్న అభ్య‌ర్ధులు త‌మ‌ని తాము ప‌రిచ‌యం చేసుకుని, ఎల‌క్ష‌నీరింగ్‌లో ఎదురైన అనుభ‌వాల‌ను పార్టీతో పంచుకున్నారు. అనంత‌రం అభ్య‌ర్ధుల‌ను ఉద్దేశించి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ.. "పీఆర్పీ స‌మ‌యంలో అంతా ఆశ‌తో వ‌చ్చారు, ఆశ‌యంతో ఎవ‌రూ రాలేదు. జ‌న‌సేన పార్టీ మాత్రం ఆశ‌యాల‌తో ముందుకు వెళ్తుంది. నాకు ఓట‌మి భ‌యం లేదు, ఫ‌లితం ఎలా ఉంటుందనే భ‌యం లేదు. ఎన్ని సీట్లు వ‌స్తాయి అన్న అంశం మీద దృష్టి పెట్ట‌లేదు. ఎంత పోరాటం చేశామ‌న్న అంశం మీదే నా ఆలోచ‌న‌. మార్పు కోసం మ‌హిళ‌లు చాలా బ‌లంగా నిల‌బ‌డ్డారు. గెలుస్తారా.?  లేదా.? అన్న అంశం ప‌క్క‌న‌పెట్టి భ‌య‌ప‌డ‌కుండా వ‌చ్చి ఓట్లు వేశారు.  

సహనం అవసరం

పొలిటిక‌ల్ ప్రాసెస్‌లో స‌హ‌నం, ఓపిక అవ‌స‌రం. గుండె ధైర్యం కావాలి. అంతా క‌న్వెన్ష‌న‌ల్ పాలిటిక్స్ చేస్తున్నారు. నేను మాత్రం అలాంటి రాజ‌కీయాలు చేయ‌ను. డ‌బ్బు ఇచ్చి ఓట్లు కొనాలి అంటే ఇంత దూరం ప్ర‌యాణం చేయాల్సిన అవ‌స‌రం లేదు. నేను ఓట‌మి లోతుల నుంచి బ‌య‌టకు వ‌చ్చాను. నాకు నిగ్ర‌హం-నియ‌మం ఉన్నాయి. ఎన్నో అవ‌మానాలు, వెట‌కారాలు భ‌రించాను. 2014లో జ‌న‌సేన పార్టీ స్థాపించే స‌మ‌యంలో ఎన్ని సీట్లు వ‌స్తాయి అన్న ఆలోచ‌న చేయ‌లేదు. ఎక్క‌డో ఒక చోట మార్పు రావాలి అని మాత్ర‌మే ఆలోచించాను. చాలా మంది సీటు గెలిచి మీకు గిఫ్ట్‌గా ఇస్తామంటున్నారు. ప్ర‌జాస్వామ్యంలో అలాంటి ప‌దాల‌కు తావులేదు. అంతా పార్టీ నిర్మాణం జ‌ర‌గాలి అని స‌ల‌హాలు ఇస్తున్నారు. అది అంత తేలిక ప్రక్రియ కాదు. అన్ని పార్టీల్లా కూర్చుని వీరికి సెక్ర‌ట‌రీ, వారికి అది అని ఇచ్చే ప‌ద‌వులు ఇవ్వడం కాదు పార్టీ  నిర్మాణం అంటే.  కొత్త‌తరాన్ని త‌యారు చేస్తున్నాం. అంతా ఓ భావ‌జాల‌నికి అల‌వాటు ప‌డాలి. నన్ను అర్ధం చేసుకునే వారు కావాలి. దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళ్తున్నాం. జ‌న‌సేన పార్టీ స్థాపించిన‌ప్పుడు లీడ‌ర్స్ లేరు. జ‌న‌సైనికులు మాత్ర‌మే ఉన్నారు. అదే జ‌న‌సైనికులు కొన్ని ల‌క్ష‌ల మంది యువ‌త రూపంలో మీ వెంట ఉన్నారు. అంతా కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌చ్చే యువ‌త‌. వారికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ప్ప ఎవ‌రూ తెలియ‌దు. ఎవ‌రి మాట విన‌రు. ఇదంతా ముడి స‌రుకు.  దాన్ని శుద్ధి చేయాలి, సాన‌బ‌ట్టాలి. అందుకు నిబ‌ద్ద‌త అవ‌స‌రం. పార్ల‌మెంట‌రీ క‌మిటీలు కూర్చుని వేస్తే రెండు రోజుల్లో ముగించేయొచ్చు. రెండు వారాలు రాత్రి, ప‌గ‌లు క‌ష్ట‌ప‌డితే గాని పూర్తి కాలేదు. పోరాటం చేస్తారు అన్న న‌మ్మ‌కంతోనే సీటు ఇచ్చాం. ఇబ్బందులు ఎదురైన‌ప్పుడు డిఫెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనే వ్య‌క్తిత్వం బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఎవ‌రి మ‌న‌సులో అయినా మోసం చేయాల‌న్న భావ‌న వ‌స్తే అది నన్ను మోసం చేసిన‌ట్టు కాదు. మీకు మీరే చేసుకున్న‌ట్టు. ఎన్ని సీట్లు గెలిచామ‌న్న దానికంటే, ఎంత శాతం ఓటింగ్ వ‌చ్చింది అన్న‌ది, ఎంత మందిని మార్పు దిశ‌గా క‌దిలించామ‌న్న‌దే ముఖ్యం. ముందుగా ఓట్లు వేసిన వేలాది మందిని గౌర‌వించండి. ఎంత బాగా పోరాడాం అన్న అంశం మీద ఆలోచ‌న చేయండి. స్థానిక స‌మ‌స్య‌ల మీద, స్థానిక ఎన్నిక‌ల మీద దృష్టి పెట్టండి. మార్పు మొద‌లైంది. అది మ‌న గెలుపు. మార్పు అన్న‌ది గొప్ప అంశం, ఎమ్మెల్యే అన్న‌ది చిన్న అంశం అని గుర్తుపెట్టుకోండి" అని అన్నారు.

జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత శ్రీ నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ.. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఆరోగ్యం స‌హ‌క‌రించ‌కున్నా బ‌ల‌మైన మార్పు తేవాల‌న్న ఏకైక కాంక్ష‌తో, ప‌ట్టుద‌ల‌తో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు చేసిన ప్ర‌య‌త్నాన్ని అంతా మెచ్చుకోవాలి.  ఇది ఓట్లు, సీట్లు లెక్క‌లు వేసుకునే స‌మీక్షా స‌మావేశం కాదు. అభ్య‌ర్ధులు ఒక‌రికి ఒక‌రు ప‌రిచ‌యం చేసుకోవ‌డంతోపాటు ఓ కొత్త‌త‌రం రాజ‌కీయ వేదిక నుంచి బ‌రిలోకి దిగిన మీ అనుభ‌వాలు తెలుసుకోవ‌డ‌మే ఈ ముఖాముఖి ఉద్దేశం. రాబోయే కాలంలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఎలా ఎదుర్కొవాలి. స‌మ‌స్య‌ల నుండి ఎలా బ‌య‌ట‌ప‌డాలి, పార్టీతో దీర్ఘ‌కాలం ప్ర‌యాణం ఎలా కొన‌సాగించాలి అన్న అంశాలు పంచుకునేందుకే ఏర్పాటు చేశాం" అన్నారు. పార్టీ అధ్యక్షుల రాజకీయ సలహాదారు శ్రీ పి. రామ్మోహన్ రావు మాట్లాడుతూ "పార్టీ గెలుపు కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రినీ గౌర‌వించండి. మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. 23వ తేదీ కౌంటింగ్‌కు త‌గు జాగ్ర‌త్తలు తీసుకోండి. ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్ల నియామ‌కంలో జాగ్ర‌త్త‌లు పాటించండి. వెయ్యి, అయిదు వందల ఓట్లు తేడాలు చాలా చోట్ల వస్తాయి. కౌంటింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించాలి. అని అభ్య‌ర్ధుల‌కు సూచించారు. ఈ స‌మావేశంలో కౌంటింగ్ ప్ర‌క్రియ‌కు సంబంధించి అభ్య‌ర్ధుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రూపొందించిన బుక్‌లెట్‌ను పార్టీ అధినేత శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ఆవిష్క‌రించి, స‌మావేశానికి హాజ‌రైన అభ్య‌ర్ధుల‌కు అంద‌చేశారు. స‌మావేశంలో పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ శ్రీ మాదాసు గంగాధ‌రం, ప‌లువురు పార్టీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

13 May, 2019 0 42
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు