హీరోయిన్లను పక్కన పెట్టేయడమే ట్రెండా?
విభాగం: సినిమా వార్తలు
no-place-for-heroines-in-star-hero-movie-teasers_kuwait

ఇండియాలో ఏ భాషలో అయినా సరే.. పది సినిమాలొస్తే.. అందులో ఆరేడు సినిమాల్లో హీరోయిన్‌ది కరివేపాకు తరహా పాత్రే అయి ఉంటుంది. మిగతా సినిమాల్లో కూడా హీరోకు దీటుగా హీరోయిన్ పాత్ర ఉండదు. కాకపోతే కొంచెం ప్రాధాన్యం ఉంటుంది. గత కొన్నేళ్లలో పరిస్థితి కొంచెం మెరుగైనప్పటికీ.. ఇప్పటికే పెద్ద సినిమాలు చాలా వాటిలో హీరోయిన్ పాత్ర నామమాత్రంగా ఉంటుంటుంది. మంచి కథాబలమున్న సినిమాలు తీసే దర్శకులు సైతం హీరోయిన్ పాత్రను తేల్చి పడేస్తుంటారు. సినిమాల్లో కథానాయికకు ప్రాధాన్యం తగ్గించడమే కాదు.. టీజర్, ట్రైలర్లలోనూ వారి పాత్రను పరిమితం చేస్తున్నారు. ఈ మధ్య అయితే ట్రైలర్లలో ఏదో నామమాత్రంగా చూపించి.. టీజర్లలో అయితే హీరోయిన్ పాత్రకు చోటే లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల టీజర్లలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

‘అరవింద సమేత’ సినిమాలో హీరోయిన్ పాత్ర కీలకం. టైటిల్లో సైతం కథానాయిక పేరుకు చోటిచ్చారు. ఇలాంటి సినిమా టీజర్లో అసలు కథానాయికే కనిపించలేదు. తాజాగా రిలీజైన రామ్ చరణ్ సినిమా టీజర్ ‘వినయ విధేయ రామ’ టీజర్లోనూ కథానాయిక కనిపించలేదు. దీని కంటే ముందు వచ్చిన ‘భరత్ అనే నేను’ టీజర్లోనూ అంతే. అంతకుముందు ‘రంగస్థలం’.. ‘స్పైడర్’ లాంటి టీజర్లలోనూ హీరోయిన్‌కు అసలు చోటే లేకుండా చేశారు. ఇంతకుముందు కొంచెం మొహమాటానికైనా కథానాయికను టీజర్లో ఒక్క క్షణం అలా చూపించేవాళ్లు. కానీ ఇప్పుడు పూర్తిగా హీరోయిన్ పాత్రే లేకుండా టీజర్ వదలడం ట్రెండుగా మారింది. కథ కథానాయిక చుట్టూనే తిరిగితేనో.. ఏదైనా లవ్ స్టోరీ అయితేనో తప్ప కథానాయికల్ని టీజర్లలో చూపించట్లేదు. ఇది అన్యాయమే అని చెప్పాలి.

 

 

 

 

SOURCE:GULTE.COM

10 Nov, 2018 0 68
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు