జూన్ 21- మార్క్ దిస్ డేట్ అమ్మా
విభాగం: సినిమా వార్తలు
june-21-mark-the-date_kuwait

2017 ఆగస్టు 25.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని తేదీ. టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలైన తేదీ. ఈ సినిమా ఎంతటి సంచలనాలకు తెర తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ చిత్రం వేర్వేరు భాషల్లో రీమేక్ అవుతోంది. ఐతే వాటిలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నది ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కిన హిందీ వెర్షనే. 

‘అర్జున్ రెడ్డి’ రూపకర్త సందీప్ రెడ్డి వంగానే హిందీ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తుండటం.. షాహిద్ కపూర్ లాంటి మంచి పెర్ఫామర్ లీడ్ రోల్ చేస్తుండటం.. కియారా అద్వానీ లాంటి అందాల కథానాయిక అతడితో జోడీ కడుతుండటంతో ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తన సినిమానే రీమేక్ చేస్తున్నప్పటికీ స్క్రిప్టు మీద చాన్నాళ్లు పని చేశాడు సందీప్. హిందీ ప్రేక్షకుల టేస్టుకు అనుగుణంగా.. బాలీవుడ్ ప్రొడక్షన్‌ హౌజ్‌ల ప్రమాణాలకు అనుగుణంగా స్క్రిప్టును తీర్చిదిద్దాడు.

ప్రాజెక్టు ఓకే అయిన ఏడాదికి కానీ ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లలేదు. ఐతే షూటింగ్ మొదలయ్యాక మాత్రం శరవేగంగా పని పూర్తయింది. టాకీ పార్ట్ పూర్తి చేసి పో్స్ట్ ప్రొడక్షన్ మీద దృష్టిపెట్టింది చిత్ర బృందం. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ ఒక పోస్టర్ వదిలారు. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ నెల 9న టీజర్ కూడా లాంచ్ చేస్తున్నారు.

తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ అనేక వివాదాలకు దారి తీసింది. ఇందులో ముద్దులు, బోల్డ్ సీన్స్ మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఐతే బాలీవుడ్లో ఇలాంటి ఇబ్బందేమీ ఉండదు. దీంతో డోస్ ఇంకా పెంచి మరింత బోల్డ్‌గా, రాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడట సందీప్. టీజర్లోనే ఆ డోస్ ఎలాంటిదో చూపించబోతున్నారట. ఈ నేపథ్యంలో టీజర్ కోసం అటు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం హిందీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని భావిస్తున్నారు. మరి తెలుగులో మాదిరే హిందీ రిలీజ్ డేట్‌ కూడా ప్రేక్షకుల మదిలో ముద్ర వేసుకుపోతుందేమో చూడాలి.

 

SOURCE  : GULTE

07 Apr, 2019 0 36
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు